- లేదంటే ట్యాంక్ బండ్పై లక్ష మంది విద్యార్థులతో ర్యాలీ
- సర్కారుకు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి డెడ్ లైన్
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను జులై 1లోగా విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ట్యాంక్ బండ్ మీద లక్ష మంది విద్యార్థులతో నిరసన ర్యాలీ తీస్తామని హెచ్చరించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను మూడేండ్ల పాటు పెండింగ్ పెట్టిందని, కాంగ్రెస్ కూడా రెండున్నరేండ్లుగా బకాయిలు చెల్లించలేదన్నారు.
పేద విద్యార్థులు బర్రెలు, గొర్రెలు, మేకలు కాసుకుంటూ బతకాలా? అని ప్రశ్నించారు. సర్కార్ నిర్ణయాల వల్ల డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని అన్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా కంప్లీట్ చేసినా ఫీజు కట్టక, విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో చాలామంది విద్యార్థులు జొమాటో, స్విగ్గీ బాయ్స్ గా పని చేస్తున్నారని కాటిపల్లి చెప్పారు. బకాయిలు రిలీజ్ చేయకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కలిసి పోరు బాట నిర్వహిస్తామని హెచ్చరించారు.
