
- పీసీసీ పదవిని కొనుక్కుని పార్టీని కబ్జా చేసిండు
- ఒక దుర్మార్గుడి చేతిలోకి పార్టీ వెళ్లిపోయింది
- తెలంగాణను తిరిగి వశం చేసుకోవడానికి చంద్రబాబు డైరెక్షన్లో సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్ర
- బైపోల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతై
న్యూఢిల్లీ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పైసలతో కొనుక్కొని, పార్టీని కబ్జా చేశారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణలో ఉన్నది మూడు రంగుల కాంగ్రెస్ కాదు. పసుపు కాంగ్రెస్. దీని వెనక చంద్రబాబు ఉన్నడు. సీఎం అంటే చంద్రబాబు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అని అర్థం” అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు తిరిగి తెలంగాణను వశం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ను ముందు పెట్టి, దోపిడీదారులు, ఆంధ్రా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లను చంద్రబాబు నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్పార్టీ అంటే గౌరవం తమకు ఉందని, ఒక దుర్మార్గుడి చేతిలోకి పార్టీ వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరికపై ఈ నెల 21 న మునుగోడులోని చౌటుప్పల్ మండలంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తున్నానని చెప్పారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తమను కోమటిరెడ్డి బ్రదర్స్ గానే ప్రజలు గుర్తిస్తారని, తాము ఎప్పుడూ కలిసే ఉంటామన్నారు. ‘‘టీడీపీలో చెడ్డ పనులు చేసినందుకే రేవంత్ ను జైలుకు పంపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ను వీడితే, సీఎం కావాలనుకుంటున్న తన కల నెరవేరదని, కాంగ్రెస్ ఖాళీ అవుతదని రేవంత్ బాధపడుతున్నారా? మమ్మల్ని వాడుకుని సీఎం అవుదామని రేవంత్వేస్తున్న పాచిక పారదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టారీతిన ఆయన నోరు పారేసుకుంటున్నరు. రాజకీయంగా ఎదుర్కొనలేక నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నడు’’ అని రాజగోపాల్ అన్నారు. తనపై 120 కేసులు ఉన్నాయని చెబుతున్న రేవంత్.. ఆ కేసులు తెలంగాణ ఉద్యమంలో పెట్టినవా? అని ఆయన నిలదీశారు.
రాజీనామా ఆమోదించుకొని ప్రజల్లోకి వెళ్తా
తన రాజీనామాను ఆమోదించే వరకు స్పీకర్ ఇంటి వద్ద, ఆఫీసు వద్ద కూర్చుంటానని రాజగోపాల్ చెప్పారు. తన రాజీనామాను ఆమోదించుకొని, ప్రజల్లోకి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు బై ఎన్నిక సునామీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్ని రోజులు ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం ఆపగలదని ప్రశ్నించారు. లేదంటే జనరల్ ఎలక్షన్స్ వస్తాయని, అప్పుడు టీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగుతుంది. పీసీసీగా బాధ్యతలు తీసుకున్నాక ఎన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది? రేవంత్ ఒక సినిమా స్టైల్ హీరో. గన్ మెన్లు, బాక్సర్లు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కేసి సినిమా డైలాగ్ లు కొడతరు. రేవంత్ శైలిని చూసి కార్యకర్తలు పార్టీ వీడుతామని మాకు ఫోన్లు చేస్తున్నరు. మేధావులు, ఉద్యమకారులు, మునుగోడు ప్రజలు.. రేవంత్ భాషను చూసి అసహ్యించుకుంటున్నారు. అద్దంకి దయాకర్ ను తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నించిండు. అలాంటి వ్యక్తితో రేవంత్ తమను తిట్టిస్తున్నడు. మునుగోడు ప్రజల కోసం అన్నీ త్యాగం చేస్తా. బీజేపీ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా చేస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఓడించే శక్తి కాంగ్రెస్కు లేదు. రాబోయే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చుతది. ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ సర్కార్ దిగి వస్తది. అసెంబ్లీ వేదికగా మునుగోడు సమస్యలను అనేక మార్లు లేవనెతినా పట్టించుకోని కేసీఆర్... ఉప ఎన్నిక భయంతో రోడ్లు, డ్రైనేజీ, ఇతర పనుల కోసం అధికారులలకు ఆదేశాలిచ్చారు” అని రాజగోపాల్ పేర్కొన్నారు.