ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి : కూనంనేని

ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి : కూనంనేని
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ

హైదరాబాద్,వెలుగు : ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌,- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల 3 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి బుధవారం లేఖ రాశారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) స్కీమ్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు.  

వీరు జిల్లాస్థాయి, పీహెచ్‌సీ స్థాయి, సబ్‌ సెంటర్‌ స్థాయి దాకా  పని చేస్తున్నారని తెలిపారు.  ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం పని చేస్తూ ప్రభుత్వానికి తమ సేవలను అందిస్తున్నారన్నారు.  ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన జీతాలు 3 నెలలుగా అందకపోవటంతో పేద, మధ్యతరగతికి చెందిన ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  

కేంద్రం నుంచి  నిధులు రాకపోవటంతో  వీరి జీతాలు ఆగినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆందోళన, సమ్మె చేసినప్పుడు  పీఆర్సీ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా..  ఏడు నెలలవి ఇవ్వలేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి వెంటనే వారి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.