పద్ధతి మారకుంటే పొత్తును వదులుకుంటం: సీపీఐ నేతలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నాం కాబట్టే వంద గ్రామ పంచాయతీలు గెలిచామని.. లేదంటే మరో 60 గెలిచేవాళ్లమని సీపీఐ స్టేట్ కమిటీ నేతలు పేర్కొన్నారు. సీపీఐ నేతలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని.. ఈ పద్ధతి మారకపోతే కాంగ్రెస్తో పొత్తును వదులుకుంటామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సమితి తీసుకున్న నిర్ణయాలను బుధవారం హైదరాబాద్‌లోని మక్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గుడిసెలు వేసుకున్నవారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు గుర్తింపు సంఘం ఈ నెల 18 నుంచి 30వ వరకు బస్సు యాత్ర చేపట్టనుందని.. దీనికి సీపీఐ మద్దతు ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయిస్తే తక్షణమే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
