ఆదిలాబాద్, బైంసాను ఎంఐఎంకు అప్పగించే కుట్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, బైంసాను ఎంఐఎంకు అప్పగించే కుట్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్, బైంసా మున్సిపాలిటీలను ఎంఐఎంకు అప్పగించేందుకు అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్, అక్బరుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ మాటిచ్చాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చైర్​పర్సన్​స్థానాలను ఎంఐఎం అభ్యర్థులకు కట్టబెట్టేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరిందన్నారు. ఆదివారం తన క్యాంప్​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

ఇప్పటికే ఎయిర్ పోర్టు మంజూరైందని, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల్లేవని, అప్పులే ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి చెప్పారన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ మున్సిపాలిటీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తొలగించిన ఫుట్ పాత్, స్లాటర్ హౌస్​ను మళ్లీ ప్రారంభిస్తామని ఒవైసీ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.