- ఆర్టీసీ డీఎంపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆగ్రహం
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని బస్టాండ్‌ను బందెలదొడ్డిలా అపరిశుభ్రంగా చేస్తే ఎలా.. అంటూ రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆర్టీసీ డీఎం నాగభూషణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 36వ డివిజన్ పరిధిలోని బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా దాదాపు రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు విస్తరణ, ప్లాట్‌ఫామ్ రిపేర్లు, శానిటరీ పైప్‌లైన్‌ల ఏర్పాటు, బస్టాండ్ ఆవరణలో పెయింటింగ్ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
బస్టాండ్ ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు బస్టాండ్ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కాటన్ బజార్ పేరుతో బట్టలు, చెప్పుల షాప్‌నకు కిరాయికి ఇవ్వడం, అనవసరమైన నిర్మాణాలు చేపట్టడం, పాత కట్టడాలను కూల్చివేయకపోవడంపై ఎమ్మెల్యే డీఎంపై ఫైర్అయ్యారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతకుముందు 57వ డివిజన్లో వార్డు బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్ నగరాలతో రామగుండం నగరం పోటీపడుతూ ఉత్తర తెలంగాణలో ప్రధాన నగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమాలలో మేయర్ మహాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ఏసీపీ ఎం.రమేశ్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, కార్పొరేషన్ ఏసీపీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
