
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏ పదవి లేకపోయినా పనిచేస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సీనియర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే తాము రాజీనామా చేశామని ఆమె చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేయని వాళ్లు కూడా మాట్లాడితే ఎలా సహించేదని సీతక్క ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసిన 13 మంది నేతలు.. రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న ‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి (పీఈసీ మెంబర్), ఎమ్మెల్యే సీతక్క(పీఈసీ మెంబర్), విజయ రమణారావు ( టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), దొమ్మాటి సాంబయ్య (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), వజ్రేశ్ యాదవ్ (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), చారగొండ వెంకటేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సత్తు మల్లేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), శశికళ యాదవ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), చిలుక మధుసూదన్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), పటేల్ రమేశ్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సుభాష్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), కవ్వంపల్లి సత్యనారాయణ (డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్) ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కు పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఈ నాయకులంతా ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో సమావేశమవడం గమనార్హం.