నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో UTF అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓడిపోయారు. గెలుపు కోటా ఓట్లు 9 వేల 14 ఓట్లు కాగా.. నర్సిరెడ్డికి 8వేల 976 ఓట్లు, పూల రవీందర్ కు 6వేల 279 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 38 ఓట్లు వస్తే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల కింద నర్సిరెడ్డి గెలిచేవారు. కానీ.. 38 ఓట్లు తక్కువ రావడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు మద్దతిచ్చిన నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ మద్దతిచ్చిన పూల రవీందర్ ఓడిపోయారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో మొత్తం 18వేల 885 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 858 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మొత్తం 18వేల 27 ఓట్లు మాత్రమే చెల్లాయి. ఇందులో.. యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8వేల 976 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ కు 6వేల 279 ఓట్లు.. పీఆర్టీయూ రెబల్ క్యాండిడేట్ సర్వోత్తమ్ రెడ్డికి 1873 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో నర్సిరెడ్డికి 3 వేల 566, పూల రవీందర్ కు 2వేల 547, రెండో రౌండ్ లో నర్సిరెడ్డికి 3 వేల 358, పూల రవీందర్ కు 2వేల 429 ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్ లో నర్సిరెడ్డికి 2వేల 52, పూల రవీందర్ కు… 13వందల 3 ఓట్లు వచ్చాయి. ప్రతీ రౌండ్ లో నర్సిరెడ్డి.. ఓట్లు పెరగ్గా.. పూల రవీందర్ ఓట్లు తగ్గుతూ వచ్చాయి.