ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్..మీరా మమ్మల్ని విమర్శించేది..

ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్..మీరా మమ్మల్ని విమర్శించేది..

ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కు  కాంగ్రెస్  కట్టుబడి ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాయితీలు అన్ని కొనసాగిస్తామని చెప్పారు. అసలు ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్  నిరసనలు చేపట్టడాన్ని తప్పుపట్టారు. బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు  అవాకులు చెవాకులు మాట్లాడితే.. ప్రజలు హర్షించరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

ఎన్ఆర్ఐలతో చిట్ చాట్ లో రైతు బంధు, ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ విధానంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో ఉచిత విద్యుత్ ఏ మేరకు అవసరమో వివరిస్తే బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉచితంగా విద్యుత్ అందించాలని మొదట ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా మొట్ట మొదటి సంతకం ఉచిత విద్యుత్ పై చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ట్రాన్స్ ఫార్మర్ ల వారీగా ఏ మేరకు 24 గంటలు సరఫరా చేశారో.. బీఆర్ఎస్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే.. రైతులు రొడ్డేక్కితేగాని రిపేర్ చేయలేదని అన్నారు. 

ఎన్నికల్లో వాగ్దానం చేయకపోయినా రైతుల విద్యుత్ బకాయిలు మాఫీ చేశామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. బీఅర్ఎస్ పాలనలో క్వింటాల్ కు 5 కిలోల కోతతో ప్రతి రైతు ఎకరానికి రెండు వేలు నష్టపోయారని అన్నారు. రైతుబంధు నెపంతో ఉమ్మడి రాష్ట్రంలోని విత్తన రాయితీ, వడ్డీ రాయితీ, వ్యవసాయ పరికరాలపై రాయితీ నిలిపి వేశారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2400 మెగా వాట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్నట్లు రైతు బంధు పటిష్టంగా అమలు చేస్తామని అన్నారు. వరి మద్దతు ధరకు అనుగుణంగా అదనంగా రూ.500 కల్పిస్తామని తెలిపారు. విద్యుత్ యూనిట్ కు రూ. 4 ఉంటే, యూనిట్ కు రూ.16 చొప్పున కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇస్తే,.. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించలేని సీఎం కేసీఆర్ కు ఉచిత విద్యుత్ పై  నైతికంగా మాట్లాడే హక్కు లేదన్నారు.