పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెడతారని ఆశిస్తున్నాం

పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెడతారని ఆశిస్తున్నాం

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి  భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో  సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవన్ కు కూడా డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని, ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిగణలోకి తీసుకుంటారని తాము ఆశిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్ర సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం, హక్కులు దక్కాలన్న అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ అనతి కాలంలోనే  సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో అన్ని వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ  రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరచారని, దానివల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఫెడరల్ స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడుతాయని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు.  దేశ గౌరవాన్ని  మరింత ఇనుమడింప చేయడానికి కొత్తగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.