మళ్లీ తెరపైకి శంషాబాద్ కు ఎంఎంటీఎస్...పదేండ్ల కిందటి ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే

మళ్లీ తెరపైకి శంషాబాద్ కు ఎంఎంటీఎస్...పదేండ్ల కిందటి ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే
  •     హైస్పీడ్​ ట్రైన్​ హబ్, మెట్రో కారిడార్​, బస్​ టెర్మినల్​ఏర్పాటుతో ఆలోచన  
  •     తక్కువ ధర, అన్ని ఏరియాల నుంచి కనెక్టివిటీ కోసం ప్రయత్నం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కు కనెక్టివిటీ పెంచేందుకు  ఆయా శాఖలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్​పోర్ట్​కు చేరుకునేందుకు ఇప్పటికే మెట్రోరైల్​ రెండోదశ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, శంషాబాద్​లోనే బస్​టెర్మినల్​నిర్మించేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కూడా ఉమ్ధానగర్​నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వరకూ ఎంఎంటీఎస్​ విస్తరించే ప్రపోజల్స్​పరిశీలిస్తోంది. 

పదేండ్ల కిందటే ఎయిర్​పోర్ట్​కు ఎంఎంటీఎస్​కనెక్టివిటీ కోసం రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫలక్​నుమా నుంచి ఉమ్ధానగర్​వరకు లైన్లను డబ్లింగ్​చేయడం, ఎలక్ట్రిఫికేషన్ తో పాటు శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వరకు 6 కి.మీ కొత్త లైన్​నిర్మాణం కోసం దాదాపు రూ. 100 కోట్లు అవుతుందని అప్పట్లో ప్రతిపాదించారు. అయితే, దీన్ని జీఎంఆర్​వ్యతిరేకించడంతో ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. తాజాగా హైస్పీడ్​బుల్లెట్​ ట్రైన్​హబ్, మెట్రో రెండోదశతో ఎంఎంటీఎస్​కూడా విస్తరించాలన్న రైల్వే అధికారులు భావిస్తున్నారు. 

ఎయిర్​ పోర్ట్​ కేంద్రంగా..

శంషాబాద్​ఎయిర్​పోర్ట్​ కేంద్రంగా ప్రస్తుతం అనేక నిర్మాణాలకు ఆయా శాఖలు ప్రతిపాదనలు చేశాయి. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన హైస్పీడ్​బుల్లెట్​ట్రైన్స్​హబ్​ను శంషాబాద్​లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహదూర్​గూడలో450 ఎకరాలలో దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్​– బెంగళూరు, హైదరాబాద్​– చెన్నై, హైదరాబాద్​– పుణెలకు హైస్పీడ్​ ట్రైన్లు ఇక్కడి నుంచే నడవనున్నాయి. 

అలాగే, దీనికి సమీపంలోనే టీజీఎస్ఆర్టీసీ బస్​టెర్మినల్​ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. దీని కోసం150 ఎకరాలను సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైల్​రెండోదశ పనులు చేపట్టి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కు కనెక్టివిటీ ఇవ్వనున్నది. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్​పోర్ట్​కు చేరుకోవాలంటే ఎంఎంటీఎస్​తో సాధ్యమని, తక్కువ ధరతో వచ్చే అవకాశం ఉంటుంది అధికారులు ప్లాన్​చేస్తున్నారు. 

ధర తక్కువ.. ఎక్కువ మంది ప్రయాణం 

శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వరకు ఎంఎంటీఎస్ వేస్తే రైల్వే నెట్​వర్క్​మరింత బలోపేతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ వెళ్లడానికి వివిధ రకాల ట్రాన్స్​పోర్ట్​ను వినియోగిస్తున్నారు. ఒకవేళ శంషాబాద్​వరకు ఎంఎంటీఎస్​వేస్తే తక్కువ ధరతో, ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం ఉంటుంది.