పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. పౌరసత్వ చట్టంలో కొత్తగా చేసిన సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నిరసనకారులు భారీగా గుమ్మిగూడారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎర్రకోట దగ్గర నిరసనలకు అనుమతి లేదని, నిర్దేశిత ప్రాంతాల్లోనే శాంతియుతంగా నిరసనలు చేయాలని పోలీసులు సూచించారు.
అలాగే మరికొన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించారు. అయితే నిరసనలు తీవ్రతరం కావడంతో రూమర్లు ప్రచారం జరిగి, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ సేవల్ని నిలిపేయాల్సిందిగా అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వం. ఢిల్లీ నార్త్, సెంట్రల్ జిల్లాలతోపాటు, మండీ హౌస్, సీలాంపూర్, జఫ్రాబాద్, ముస్తఫాబాద్, జామియా నగర్, షయీన్ బాగ్ ప్రాంతాల్లో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా ఆపేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో సర్వీసులను నిలిపేశామని, వినియోగదారులు గమనించాల్సిందిగా తెలుపుతూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ – ఐడియా వంటి టెలికాం కంపెనీలు ట్వీట్ చేశాయి. ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు రాగానే సేవల్ని పునరుద్ధరిస్తామని తెలిపాయి.
For More News…
