ప్రజలు భయపడొద్దు.. అవగాహన కోసమే మాక్ డ్రిల్: సీపీ ఆనంద్

ప్రజలు భయపడొద్దు.. అవగాహన కోసమే మాక్ డ్రిల్: సీపీ ఆనంద్

హైదరాబాద్: కేంద్ర ఆదేశాల మేరకు హైదరాబాద్‎లో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించామని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో మొత్తం నాలుగు చోట్ల సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ అనంతరం సీపీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. బుధవారం (మే 7) 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అలెర్ట్ ఇచ్చాం..రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్ వాహనాలు, ఇండస్ట్రియల్  సైరన్లు మోగాయని తెలిపారు. నాలుగు ప్రాంతాల్లో మిస్సైల్ అటాక్ జరిగినట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సందేశం ఇచ్చామని చెప్పారు. 

అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ మాక్ డ్రిల్‎లో పాల్గొన్నారన్నారు. నాలుగు ప్రాంతాల్లో పోలీసులు, మెడికల్, ఫైర్ డిజాస్టర్ రెవిన్యూ ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. మిస్సైల్ అటాక్ జరిగిన ప్రాంతాలకు తరలి వెళ్లడం, మంటలు అంటుకుంటే ఆర్పడం వంటి అంశాలను ఈ డ్రిల్‎లో చూపించామని చెప్పారు. అంబులెన్స్‎లో రావడానికి, వెళ్లడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని.. క్షతగాత్రులను తరలించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు.

►LSO READ | వార్ సైరన్.. సిటీలో డిఫెన్స్ మాక్ డ్రిల్ సక్సెస్.. 1962 తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్ డ్రిల్

ఈ మాక్ డ్రిల్‎లో లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేశారని పేర్కొన్నారు. మాక్ డ్రిల్‎లో భాగంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారని చెప్పారు. మాక్ డ్రిల్‎లోని ఈ అంశాలు ప్రజల్లో అప్రమత్తత పెంచడానికేనని.. ప్రజలు ఎవరూ భయపడొద్దని సూచించారు. ఇది 54 సంవత్సరాల తర్వాత జరిగిన వార్ మాక్ డ్రిల్ అని తెలిపారు. మాక్ డ్రిల్‎లోని లోపాలను సమీక్షించుకుని అప్రమత్తత మెరుగు పర్చేలా చేస్తామన్నారు. ప్రజలు ఫేక్ వార్తలు నమ్మి భయపడొద్దని చెప్పారు.