- మూడు కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
గువహటి, కోల్‌కతా: అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఊతమిచ్చారు. శుక్రవారం కోక్రాఝర్ జిల్లాలో సుమారు రూ.4,570 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ప్రధాని కోక్రాఝర్‌లో పర్యటించాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు కావడంతో గువహటి నుంచే వర్చువల్‌గా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు.
కామాఖ్య–- చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గువహటి –- న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్, నారంగి – -అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపారు. కోక్రాఝర్ జిల్లాలోని బాష్‌బరి వద్ద 'పీరియాడిక్ ఓవర్ హాలింగ్' (పీఓహెచ్) వర్క్‌షాప్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 'అస్సాం మాలా 3.0' ప్రాజెక్టు కింద రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) పరిధిలో దాదాపు రూ.1,100 కోట్లతో నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్లు, రెండు వంతెనలకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
మార్చి 14న బెంగాల్‌లో పర్యటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. కోల్‌కతాలో సుమారు రూ. 18,680 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు, పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త 'పరివర్తన్ యాత్ర' ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల సవరించిన ఓటర్ల జాబితా (సర్) వెలువడిన తర్వాత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
