- ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న
గోదావరిఖని, వెలుగు: రైతాంగ పోరాటం స్ఫూర్తితో అన్నివర్గాలు పోరాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో సంఘం జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో భారత వ్యవసాయరంగాన్ని బహుళ జాతి సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. దేశంలోని ఉత్పత్తులకు, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలు రద్దు చేసి ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. అనేక త్యాగాలతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టం, 1/70 యాక్ట్, పీసా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా భూములు, అడవులను, అందులోని ఖనిజ సంపదను బహుళ జాతి కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
అన్నివర్గాల ప్రజలు, రైతులు, కూలీలు ఏకమై రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేశ్, గుండేటి మల్లేశం, జర్నలిస్టు కోల లక్ష్మణ్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, ఎం.లాల్ కుమార్, తిరుపతి, మల్లేశ్, చంద్రయ్య పాల్గొన్నారు.
