
ఓవల్ జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 2-2 తో సమం చేసి అదిరిపోయే ముగింపు ఇచ్చింది. సోమవారం (ఆగస్టు 4) చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియాపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. భారత జట్టు ఫ్యాన్స్ అందరూ ఏదైనా అద్బుతంగా జరగకపోదా అనే ఆశలో ఉన్నారు. ఐదో రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. క్రీజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న జెమీ స్మిత్ తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్ధ్యమున్న ఓవర్ టన్ ఉన్నారు.
ఆ తర్వాత అట్కిన్సన్ కూడా బ్యాటింగ్ చేయగలడు. దీంతో ఇంగ్లాండ్ విజయం ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చివరి రోజు ఆటలో తొలి ఓవర్ లోనే ఓవర్ టన్ రెండు ఫోర్లు బాది లక్ష్యాన్ని 27 కు తగ్గించాడు. ఈ దశలో సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇక ఓటమి ఖాయం అనుకుంటున్న దశలో కెప్టెన్ గిల్.. బంతిని సిరాజ్‌కు అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ తన తొలి ఓవర్‌తోనే సిరాజ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆఫ్- స్టంప్ ఆవల పడి స్వింగ్ అయిన ఓ బాల్‌తో డేంజర్ మ్యాన్ జెమీ స్మిత్ (2) బ్యాట్ నుంచి ఎడ్జ్ రాబట్టాడు. కీపర్ జురెల్ సులభంగా క్యాచ్ అందుకోవడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. సిరాజ్ వేసిన ఆ ఓవర్లోని ప్రతీ బంతి ఒక సంచలనమే అన్నట్లు సాగింది.
ఊపు మీదున్న హైదరాబాదీ తన తర్వాతి ఓవర్లో మరో మ్యాజిక్ చేశాడు. వరుసగా ఔట్‌స్వింగర్లతో ఊరించిన అతను అనూహ్యంగా ఓ ఇన్ స్వింగర్‌తో ఒవర్టన్‌ను ఎల్బీ చేశాడు. ఆతిథ్య జట్టు విజయానికి మరో ఏడు రన్స్ మాత్రమే అవసరం అవ్వడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఈ టైమ్‌లో సిరాజ్ నిప్పులు చెరిగే ఒక పర్ఫెక్ట్ యార్కర్‌ను సంధించాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఆ బాల్ అట్కిన్సన్ డిఫెన్స్‌ను ఛేదించుకుని నేరుగా ఆఫ్ -స్టంప్‌ను ఎగరగొట్టింది. ఈ మ్యాచ్ లో అలుపెరుగని యోధుడల్లే.. అసాధారణ బౌలింగ్‌తో హోరెత్తించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (4/86, 5/104) ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో 185 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా సిరాజ్ ఎప్పుడూ అలసిపోయినట్టు కనిపించలేదు. కష్టంగా ఉన్నప్పటికీ జట్టు కోసం తన 100 శాతం ఎఫర్ట్స్ ఇచ్చాడు. సోమవారం ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. జట్టు కోసం చివరి వరకు సిరాజ్ చూపించిన పోరాటానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు సైతం హ్యాట్సాఫ్ చెప్పారు. రూట్, హ్యారీ బ్రూక్ ఈ హ్యదరాబాదీ పేసర్ ను ఆకాశానికెత్తేశారు.
ఓవల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓవరాల్ గా ఈ సిరీస్ లో సిరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 32.43 సగటుతో 23 వికెట్లు పడగొట్టి, సిరీస్‌ను అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ పర్యటనలో ఐదు టెస్టుల్లోనూ ఆడిన ఏకైక భారత పేసర్ కూడా సిరాజ్ కావడం విశేషం. బుమ్రా లేని లోటును మరపిస్తూ జట్టు బౌలింగ్ భారాన్ని ముందుండి నడిపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
185.3 overs - 'Not a problem when you're playing for the country'
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2025
Mohammed Siraj 🙌 #ENGvIND pic.twitter.com/pZ13PT57kE