IND vs ENG 2025: లెక్క సరిచేసిన సిరాజ్.. నిన్న తిట్టినవాళ్ళే ఇవాళ హీరో అంటున్నారు..

IND vs ENG 2025: లెక్క సరిచేసిన సిరాజ్.. నిన్న తిట్టినవాళ్ళే ఇవాళ హీరో అంటున్నారు..

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ పై 6 పరుగుల తేడాతో  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సిరీస్ ను సమం చేసింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యాన్ని అడ్డుకున్న సిరాజ్.. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో హీరోగా హైలెట్ అయిన ఈ హైదరాబాదీ పేసర్.. నిన్న మాత్రం తీవ్ర విమర్శలకు గురయ్యాడు.

అసలేం జరిగిందంటే..?

376 పరుగుల లక్ష్య ఛేదనలో 106 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కాసేపటికే బ్రూక్ వికెట్ తీసే అవకాశం వచ్చినా సిరాజ్ క్యాచ్ పట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ 34 ఓవర్ తొలి బంతిని బ్రూక్ కు ప్రసిద్ కృష్ణ షార్ట్ బాల్ వేశాడు. మిడ్ వికెట్ గా బ్రూక్ బలంగా బాదడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వద్దకు క్యాచ్ వెళ్ళింది. మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు.

అయితే ఆ వెంటనే వెనకాలే ఉన్న బౌండరీని టచ్ చేశాడు. సిరాజ్ క్యాచ్ పట్టిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ సిరాజ్ బౌండరీ రోప్ టచ్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో సంతోషంగా ఉన్న ముఖాలు నిరాశకు గురయ్యాయి. ఈ క్యాచ్ సిరాజ్ పట్టి ఉంటే ఇంగ్లాండ్ 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పేయేది. ఆ తర్వాత రూట్, బ్రూక్ నాలుగో వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను ఇంగ్లాండ్ వైపుకు మళ్లించారు. దీంతో సిరాజ్ ను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. 

నేడు సిరాజ్ విశ్వరూపం: 

ఒక్క రోజు గడిచే సరికీ ఇప్పుడు సిరాజ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐదో రోజు ఆటకు ముందు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు కావాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయానికి 4 వికెట్లు అవసరం. ఈ దశలో టీమిండియా విజయంపై పెద్దగా ఆశలు ఎవరికీ లేవు. అయితే చివరి రోజు సిరాజ్ సంచలన బౌలింగ్ తో మెరిశాడు. మొదట జెమీ స్మిత్ (2), ఓవర్ టన్ (9) వికెట్లను తీసి మ్యాచ్ ను టీమిండియా వైపుకు తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్ విజయానికి 8 పరుగులు అవసరం అనుకున్న సమయంలో అట్కిన్సన్ (17) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తానికి నిన్న తిట్టుకున్న సిరాజ్ ను టీమిండియా ఫ్యాన్స్ నేడు తెగ పొగిడేస్తున్నారు.