ఒడిశా కొత్త సీఎంగా మోహన్ మాఝీ

ఒడిశా కొత్త సీఎంగా మోహన్ మాఝీ
  • డిప్యూటీలుగా కేవీ సింగ్, ప్రవతి
  • నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • హాజరవనున్న ప్రధాని మోదీ

భువనేశ్వర్: ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నాయకుడు మోహన్  చరణ్  మాఝీ(52) ను బీజేపీ ఎంపిక చేసింది. ఆయనకు డిప్యూటీ సీఎంలుగా కణక్  వర్ధన్  సింగ్  డియో, ప్రవతి పరీదా ఎంపికయ్యారు. ఈమేరకు రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్ ట్వీట్ చేశారు. ‘ఒడిశా కొత్త సీఎంగా మోహన్  చరణ్​ మాఝీ బాధ్యతలు చేపడతారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మాఝీ డైనమిక్  లీడర్, చురుకైన పార్టీ కార్యకర్త. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన మాఝీ నాయకత్వంలో ఒడిశా అభివృద్ధి చెందుతుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న మాఝీకి అభినందనలు. అలాగే ఆయనకు డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్  డియో, ప్రవతి పరీదా బాధ్యతలు చేపడతారు. వారికి కూడా అభినందనలు’ అని రాజ్​నాథ్  ట్వీట్  చేశారు.

సీఎంగా నియమితులైన తర్వాత మీడియాతో మాఝీ మాట్లాడారు. గత 24 ఏండ్ల పాటు పాలించిన ప్రభుత్వం మారిందన్నారు. బీజేపీపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆశయాలను నెరవేరుస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. దేశంలోనే ఒడిశాను నంబర్  వన్  రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కాగా, మోహన్  చరణ్​  మాఝీ భువనేశ్వర్​లో బుధవారం సాయంత్ర 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా మాజీ సీఎం నవీన్  పట్నాయక్​తో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.