అండమాన్‌‌లోకి రుతుపవనాల ఎంట్రీ 

అండమాన్‌‌లోకి రుతుపవనాల ఎంట్రీ 

ఎండలతో సతమతమౌతున్న దేశ ప్రజలకు కూల్ న్యూస్ వినిపించించింది భారత వాతావరణ శాఖ (IMD). అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించినట్లు ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. కేరళ తీర ప్రాంతం, సౌత్ కర్నాటకలలో ఉరుములు, ఈదురు గాలులతో తేలికపాట నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మే 16వ తేదీ నుంచి మే 18 మధ్య తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 01వ తేదీనాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుతాయి. అయితే ఆసని తుఫాన్ కారణంగా ఐదు రోజుల ముందు మే 27వ తేదీన తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 24 గంటల్లో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

మే 16వ తేదీన ఈశాన్య రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, దక్షిణ ఉత్తర్ ప్రదేశ్, విదర్భ, ఉత్తర్ ప్రదేశ్, మే 16, మే 17వ తేదీల్లో బీహార్, జార్ఖండ్ లలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఏకంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో వాతావరణం చల్లబడనుంది.