రెండు మూడు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే: ఐఎండీ
న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా జూన్ 1 నాటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ, ఈసారి కాస్త ఆలస్యంగా కదులుతున్నాయి.‘‘నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అంతకుముందు, మే 26 నాటికే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో, వచ్చే వారంలో ఇవి ప్రవేశించవచ్చని మే 29న ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ప్రస్తుతం రుతుపవనాలు ఇంకో రెండ్రోజుల్లో రావొచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది వర్షపాతం తగ్గడానికి ‘ఎల్ నినో’ పరిస్థితులే కారణమని వెల్లడించింది. జూన్‌లో దీని ప్రభావం బలహీనంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నాటికి ఇది మధ్యస్థం నుంచి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వివరించింది.
