ఈ జైల్లో ఏటా 5,200 మంది చనిపోతున్నరు

ఈ జైల్లో ఏటా 5,200 మంది చనిపోతున్నరు

ఏడాదికి పదులు కాదు. వందలు కాదు.. ఏకంగా 5200 మంది చచ్చిపోతున్నారిక్కడ! అయ్యో.. ఏం విపత్తు వచ్చి ఇంతమందిని బలి తీసుకుంటున్నదో అని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. జైలులో ఉండటమే వీరందరికీ వచ్చిన పెను విపత్తు! అవును.. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు సమీపంలోని న్యూ బిలిబిడ్  ప్రిజన్ (ఎన్బీపీ)లో ఏటా 5,200 మంది ఖైదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయట.

ఫిలిప్పీన్స్ లో ఇంతే..

ఒకే జైలులో ఏడాదికి 5,200 మంది ఖైదీలు చనిపోవడం అనేది చాలా షాకింగ్ ​విషయం. కానీ.. ఫిలిప్పీన్స్ జైళ్లలో ఇదో మామూలు విషయమైపోయింది. దేశంలోని ఇతర జైళ్లలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. జైళ్లన్నీ మురికివాడలను తలపిస్తాయి. ఇరుకిరుకు గదుల్లో ఖైదీలను కుక్కుతుంటారు. దీంతో ఖైదీలకు రోగాల ముప్పు చాలా ఎక్కువగా ఉంటోంది. మరోవైపు కిక్కిరిసిపోవడం వల్ల గొడవలు జరిగినప్పుడు ఖైదీలను కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో ఏటా మరణిస్తున్న ఖైదీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతేకాదు, అధికారుల అవినీతిపైనా తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్బీపీలోని పరిస్థితులపై గురువారం సెనేట్ విచారణ ప్రారంభించింది. జైలు అధికారులు, హాస్పిటల్ సిబ్బందిని అనేక అంశాలపై ప్రశ్నించింది. ఈ జైలులో ఇంత మంది చనిపోతుండటానికి రోగాలు, హింసే కారణమని, చాలా మందిని జైల్లో కుక్కడమే అందుకు కారణమని జైలు హాస్పిటల్ మెడికల్ చీఫ్​ఎర్నెస్టో తమాయో సెనేట్ విచారణలో వెల్లడించారు. క్యూజన్ సిటీ జైలులోనూ 4 వేల మంది ఖైదీలు ఒకరినొకరు రాసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి ఉందని, ఖైదీలంతా గుంపులుగుంపులుగా నేలపై నడిచేందుకు వీల్లేనంత ఇరుకుగా పడుకుని నిద్రపోతుంటారనీ సెనేటర్లు చెప్పారు. ముప్పై మంది పట్టే గదిలో 131 మందిని కుక్కుతున్నారని, 200 చదరపు అడుగుల గదిలో 85 మందిని ఉంచుతున్నారని వెల్లడించారు. జైళ్లలో అడిగినంత ఫీజు ఇస్తే చాలు.. ఖైదీలు రాజుల్లాగా బతికేయొచ్చంటూ సెనేటర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు లంచాలు తీసుకుని సెల్ ఫోన్లు, సిగరెట్లు చివరికి చిన్న చిన్న టీవీలనూ ఇస్తున్నారట.  కొందరు ఖైదీలకు పర్సనల్ కుక్స్, నర్సులు కూడా ఉన్నారట.

డ్రగ్స్ పై వార్ కూడా కారణమే…

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యుటెర్ట్ పదవి చేపట్టాక  దేశంలో డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించారు. స్మగ్లర్లపై విరుచుకుపడిన పోలీసులు దాదాపుగా వేలాది మందిని ఎన్ కౌంటర్లలో చంపేశారు. దొరికినోళ్లందరినీ జైళ్లోకి తోశారు. క్యూజన్ సిటీ జైలులో 3,600 మంది ఖైదీలుండగా, డ్యుటెర్ట్ ప్రెసిడెంట్ అయిన ఏడు వారాల్లోనే 4,053 మందికి పెరిగారు. అన్ని జైళ్లలో 2018 మే నాటికి 1,88,278 మంది ఖైదీలున్నారట.