- గ్యాస్‌పై నీళ్లు ఎందుకు వేడిచేస్తున్నావని తిట్టిన భర్త
- మనస్తాపం చెందిన భార్య.. పిల్లల గొంతు నులిమి సూసైడ్
- ప్రాణాలు కోల్పోయిన తల్లీ కొడుకు దవాఖానకు తీసుకెళ్లడంతో
- కొన ఊపిరితో ఉన్న చిన్నారి సేఫ్ పెండ్లిరోజే కుటుంబంలో విషాదం
జూబ్లీహిల్స్, వెలుగు: వంట గ్యాస్ రేపిన చిచ్చు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెండ్లి రోజు ఆనందంగా గడపాల్సిన ఫ్యామిలీలో తల్లీకొడుకుల ప్రాణాలను బలి తీసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో మురళి వేణు, సత్యవాణి (33) దంపతులు తమ పిల్లలు రుద్రాంశ్ (5), తన్విక (2)తో కలిసి నివాసం ఉంటున్నారు. విద్యుత్ శాఖలో లైన్‌మెన్ గా పనిచేసే మురళి వేణు.. ప్రతి చిన్న విషయానికి భార్యతో గొడవపడేవాడు. ఈ నెల13న రాత్రి 8 గంటల ప్రాంతంలో సత్యవాణి గ్యాస్ పై నీళ్లు వేడి చేసింది. దానిని గమనించిన మురళి వేణు.. గ్యాస్ మీద కాకుండా నీళ్లు వేడి చేయలేవా? అంటూ భార్యతో గొడవపడ్డాడు.
అనంతరం ఆమెను దుర్భాషలాడుతూ.. తన తండ్రిని ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన సత్యవాణి మొదట బిడ్డలిద్దరినీ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసింది. బిడ్డలిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లాక అనంతరం తాను ఫ్యాన్ కు ఉరేసుకున్నది. రాత్రి 9:57 గంటల ప్రాంతంలో ఇంటి ఓనర్ వెంకటేశ్వర రావు వారు నివసిస్తున్న గది వైపు చూడగా సత్యవాణి ఫ్యానుకు వేలాడుతూ కన్పించడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సత్యవాణి, కుమారుడు రుద్రాంశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, కొనఊపిరితో ఉన్న రెండేండ్ల తన్వికను గుర్తించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
