చైర్మన్ పదవి పై తొలగిన సందిగ్ధత

చైర్మన్ పదవి పై తొలగిన సందిగ్ధత

నల్గొండ, వెలుగు: నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాకార సంఘం ఎన్ని కలు మంగళవారం జరగనున్నాయి. ఈ మేరకు హయత్​ నగర్​లోని ఎస్​వీఎస్​ఫంక్షన్​హాల్​లో ఎన్నికల ఏర్పాట్లు చేశారు. డెయిరీలో మొత్తం 278 సంఘాల చైర్మన్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మూడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా, ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే మంగళవారం సాయంత్రం చైర్మన్​ఎన్నిక కూడా నిర్వహిస్తామని ఎన్నికల అధికారి హన్మంతరావు తెలిపారు.

క్యాంపు నుంచి నేరుగా పోలింగ్​ కేంద్రాలకు..

మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ, ఓటర్లు చీలిపోకుండా అభ్యర్థులు వారిని క్యాంప్ లకు తరలించారు. ఐదుగురు క్యాండిడేట్లలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారు కావడంతో ముందు జాగ్రత్తగా ఓటర్లను తరలించారు. హయత్​నగర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సకల వసతులు కల్పించారు. ఆదివారం బతుకమ్మ సంబరాలు కూడా మహిళా ఓటర్లు ఫంక్షన్​ హాల్​లోనే జరుపుకోవడం గమనార్హం. సోమవారం జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డితోపాటు, పలువురు ఎమ్మెల్యేలు ఓటర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. క్యాంపులో ఉన్న ఓటర్లు  నేరుగా పోలింగ్​ కేంద్రానికి చేరుకుంటారు. 

శ్రీకర్ రెడ్డికి డెయిరీ చైర్మన్ పదవి​...?

డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్​రెడ్డి వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు మంత్రి జగదీశ్​రెడ్డి వర్గీయుడు, ప్రస్తుత సూర్యాపేట డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం చైర్మన్ పదవి కోసం ప్రయత్నించినట్లు సమాచారం. కానీ ఎక్కువ మంది ఓటర్లు ఆలేరు నియోకజకవర్గానికి చెందిన వారే ఉండటం, ఎన్నికల ఇన్​చార్జి బాధ్యతలు కూడా మహేందర్​ రెడ్డికే అప్పగించడంతో చైర్మన్​పదవి కూడా ఆలేరుకే ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పోటీలో ఉన్న ఇతర డైరెక్టర్ల పదవీ కాలం ఏడాది, రెండేళ్లు మాత్రమే ఉండటం కూడా శ్రీకర్ రెడ్డికి కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికయ్యే చైర్మన్​ ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.