ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ ఏడాది పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలతో.. జైలు ఊచలు లెక్కించే వరకు తెచ్చుకున్నారు. కూతురి కాపురాన్ని నిలబెట్టాలనుకున్న తల్లి.. అల్లుడి దాడిలో శవమై తేలింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి చెంగిచెర్లలో జరిగింది ఈ ఘటన. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య (19), స్నేహిత్‌తో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఏప్రిల్ 28న కావ్య తల్లి కొల్లా అరుణ (39) తన కుమార్తెను ఇంటికి పిలిచింది. అదే రోజు రాత్రి కావ్య భర్త స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కుమార్తె ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో కూతురు కాపురం ఏమైపోతుందోనని ఆమె మానసిక ఆందోళనకు గురైంది.
ఏప్రిల్ 29న మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి వస్తుండగా, స్నేహిత్ ఆమెతో గొడవపడి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి పడిపోయిందని ఫోన్ లో కావ్యకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి దగ్గర్లోని మెడిస్టార్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్‌బీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలించారు.
ఆ తర్వాత డౌట్ వచ్చి కావ్య సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా స్నేహిత్ దాడిలో ఆమె గాయపడినట్లు బయటపడింది. స్నేహిత్ బైక్ పై వెళ్తూ అత్తతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం హెల్మెట్‌తో తలపై దాడి చేయడంతో ఆమె రోడ్డుపై పడిపోయినట్టు విజువల్స్ లో కనిపించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది.
తన తల్లి మృతిపై కావ్య మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.
