కేంద్రీయ విద్యాలయంపై  ఎంపీ అర్వింద్ వర్సెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే సంజయ్

కేంద్రీయ విద్యాలయంపై  ఎంపీ అర్వింద్ వర్సెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే సంజయ్
  •     విద్యాలయ నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించామంటున్న ఎమ్మెల్యే
  •     10 ఎకరాలు కావాలంటున్న ఎంపీ
  •     ఏడాదిగా ప్రారంభానికి నోచుకోని విద్యాలయం
  •     జగిత్యాల జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు భూమి కేటాయించి ప్రతిపాదనలు పంపించామని అని ఎమ్మెల్యే చెబుతుండగా, మరోవైపు పది ఎకరాలు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంపీ ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్రీయ విద్యాలయం అంశం జిల్లా రాజకీయాల్లో హాట్‌‌‌‌‌‌‌‌టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది. ప్రస్తుతం భూమి కేటాయింపు, కేంద్రం ఆమోదం, విద్యాలయం ప్రారంభం అంశాల చుట్టూనే చర్చ నడుస్తోంది.

స్థల కేటాయింపుపై భిన్న వాదనలు

కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణం కోసం జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలోని చల్గల్‌‌‌‌‌‌‌‌లో ఐదెకరాలు గుర్తించి జిల్లా యంత్రాంగం.. కేంద్రీయ విద్యాలయ సంస్థ (కేవీఎస్‌‌‌‌‌‌‌‌)కు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఐదు ఎకరాలు సరిపోవని, కనీసం పది ఎకరాల భూమి కేటాయించాలని ఎంపీ అర్వింద్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కూడా పది ఎకరాల కంటే తక్కువ భూమి కేటాయిస్తే ఊరుకోమని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో విద్యాలయ విస్తరణ, క్రీడా మైదానాలు, హాస్టల్‌‌‌‌‌‌‌‌, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ భూమి అవసరమని ఆయన వాదిస్తున్నారు.

మధ్యలో వాలంతరి క్షేత్రం

చల్గల్‌‌‌‌‌‌‌‌లోని వాలంతరి క్షేత్రాన్ని సహజ వ్యవసాయం, రైతులకు శిక్షణ కార్యక్రమాల కోసం వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడి భూమిలో ఐదెకరాలు కేంద్రీయ విద్యాలయానికి ప్రతిపాదించడం రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో అదే ప్రాంతంలో పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయించినప్పుడు అభ్యంతరాలు లేవని, ఇప్పుడు విద్యాలయం కోసం ఎక్కువ భూమి కేటాయించేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఎంపీ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వాలంతరి క్షేత్రాన్ని ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా వినియోగించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఐదు ఎకరాలే ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇప్పటికే సిద్ధంగా ఉన్న పాత ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ భవనంలోనే విద్యాలయాన్ని ప్రారంభించి విద్యార్థులకు కేంద్రీయ విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వర్గం కోరుతోంది.

ఏడాదిగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే..

జగిత్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయం 2025లో మంజూరైంది. ఏడాది గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కోసం పాత ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసినప్పటికీ ఇంకా తరగతులు ప్రారంభించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నిరాశ నెలకొంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కేంద్రీయ విద్యాలయం మంజూరైన తర్వాత శాశ్వత భవనం నిర్మాణానికి ఏడేండ్లు పట్టిందని, అప్పటి వరకు తాత్కాలిక భవనంలోనే నిర్వహించారని కాంగ్రెస్ వర్గం గుర్తు చేస్తోంది. జగిత్యాలలో కూడా అదే విధంగా ముందుగా తరగతులు ప్రారంభించాలని కోరుతోంది. మరోవైపు శాశ్వత క్యాంపస్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన భూమి విషయంలో రాజీ పడకూడదని బీజేపీ వర్గం అభిప్రాయపడుతోంది.

తుది నిర్ణయం కేవీఎస్‌‌‌‌‌‌‌‌దే

కేంద్రీయ విద్యాలయం విషయంలో ఇరుపార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నా ప్రజలు మాత్రం త్వరగా పరిష్కారం కావాలని కోరుతున్నారు. భూమి ఎంత అన్నదానిపై చర్చ కంటే ముందు విద్యాలయం ప్రారంభమై పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలపై కేవీఎస్‌‌‌‌‌‌‌‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది జరిగితేనే కేంద్రీయ విద్యాలయం అంశంపై కొనసాగుతున్న రాజకీయ చర్చకు ఫుల్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ పడే 
అవకాశం కనిపిస్తోంది.