దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి : వరంగల్ ఎంపీ కడియం కావ్య

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి  :  వరంగల్ ఎంపీ కడియం కావ్య
  •     వరంగల్ ఎంపీ కడియం కావ్య  

న్యూఢిల్లీ,వెలుగు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ సభ్యులను కలిసి ఈ విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుల ప్రకారం దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వడం సామాజిక న్యాయానికి అనుగుణమని చెప్పారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫారసు చేశాయని గుర్తు చేశారు. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని బాలకృష్ణన్ కమిషన్ కూడా సానుకూల సిఫారసు చేయాలని కోరినట్లు తెలిపారు.

సర్​పై జాగ్రత్తగా ఉండాలి.. 

తెలంగాణలో జూన్ 25 నుంచి చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కావ్య సూచించారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సరిగా నింపి సమర్పించాలని చెప్పారు. లేదంటే ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందన్నారు. ఒకసారి తుది ఓటరు జాబితా సిద్ధమైతే, తదుపరి ఎన్నికల వరకు అదే అమల్లో ఉంటుందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని  కడియం కావ్య పిలుపునిచ్చారు.