- తెలంగాణపై పిచ్చికూతలు ఏంది?
- తేజస్వీ సూర్యపై కడియం కావ్య ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆవిర్భావంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసినవి అవివేకపు వ్యాఖ్యలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కౌంటర్ ఇచ్చారు. ‘‘తెలంగాణ, తెలంగాణ ఆత్మ, ఆత్మగౌరవం, బలిదానాలు ఏంటో మాకు తెలుసు. ఎన్నో ఏండ్ల పోరాటాల తర్వాతే మాకు రాష్ట్రం సిద్ధించింది. రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమని తెలిసినా.. పెద్ద మనసుతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ బీజేపీ నేతలు అణువణువునా తెలంగాణపై వ్యతిరేకత నింపుకున్నారు. బ్లాక్ డే, ఇతర పేర్లతో బాధిస్తన్నరు’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు.
గురువారం రాత్రి 11 గంటలకు లోక్‌సభలో ‘డీలిమిటేషన్ బిల్లు–2026’, ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు’ లపై జరిగిన చర్చలో కావ్య మాట్లాడారు. దశాబ్దాల పోరాటం, ఎన్నో బలిదానాల తర్వాత ఏర్పడిన తెలంగాణ ఆవిర్భావాన్ని ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను తేజస్వీ సూర్య దెబ్బతీశారని మండిపడ్డారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కావ్య డిమాండ్ చేశారు.
అలా మాట్లాడి ఉంటే ఉపసంహరించుకుంటాం: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలను కానీ, పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తమ ఎంపీ తేజస్వీ సూర్యకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని బదులిచ్చారు. ఆయన అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: తేజస్వీ
తెలంగాణ ఆవిర్భావాన్ని ఇండియా, పాకిస్తాన్ తో పోల్చిన తేజస్వీ.. మాట మార్చారు. తన వ్యాఖ్యలు తెలంగాణపై కాదని కొత్త రాగం వినిపించారు. ‘‘నా వ్యాఖ్యలను వేరేలా అర్థం చేసుకున్నారు. వక్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని విధ్వంసంగా మార్చింది. 1200 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. 300 మంది ఫైరింగ్ లో ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నేను తప్పకుండా తెలంగాణ అమరులను గౌరవిస్తాను” అని తేజస్వీ చెప్పారు.

