న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణలోని ముఖ్య సిటీలు హైదరాబాద్– విజయవాడను కలిపే ఎన్ హెచ్–65 ని విస్తరించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్ సభలో రూల్–377 కింద ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏపీ విభజన చట్టం ప్రకారం.. ఈ రూట్ లో ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని రోడ్డు, రైలు కనెక్టివిటీని మెరుగుపర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో హైదరాబాద్ వైపు 40 కి.మీ హైవే 6/8 లేనింగ్ పనులు చేపట్టిందని తెలిపారు. కానీ, మరో వైపు ఉన్న 200 కి.మీ బ్యాలెన్స్ స్ట్రెచ్ లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లో ఉన్న కాంట్రాక్టర్లు వర్క్స్ స్టార్ట్ చేయలేదని సభ దృష్టికి తెచ్చారు. దాదాపు 50 శాతం రోడ్డు ఫోర్‌లేన్ హైవే కెపాసిటీతో ఉందని, దీన్ని సిక్స్ లేనింగ్‌ను విస్తరించేందుకు ఎలాంటి ఫండింగ్ అవసరం లేదన్నారు. ఈ రూట్లో ఉన్న జంక్షనల్లో చాలా యాక్సిడెంట్లు జరిగి ప్రజలు చనిపోయారని ప్రభుత్వానికి తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖను కోరారు.
తన సెగ్మెంట్లోని సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు పీఎం అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఎంపీ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానితో భేటీలో తెలంగాణలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలను చర్చించనున్నట్లు చెప్పారు. కాగా, ఈ అంశం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మునుగోడు బైపోల్ లో స్టార్ క్యాంపేయినర్, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకట్ రెడ్డికి ఇటీవల కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదే అంశంపై ఆయన బుధవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను కలిసి దాదాపు 40 నిమిషాలు చర్చించారు.

