బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు. కానీ బిహార్ రాష్ట్రం పాట్నాకు వెళ్లి రాజకీయాలు చేసే టైం ఉందా అని ప్రశ్నించారు.పేదల ప్రాణాల కంటే ముఖ్యమంత్రికి రాజకీయాలే ముఖ్యమా అని నిలదీశారు. పేద కుటుంబాలను పరామర్శించకుండా.. రాజకీయాలకోసం పాట్నా వెళ్లడాన్ని కేసీఆర్ ఏ విధంగా సమర్దించుకుంటారని మండిపడ్డారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం తో పాటు వారి పిల్లలకు పూర్తి విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మిగతా 30మంది మహిళలకు మెరుగైన వైద్యం అందించే  బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పేదలు ఎక్కువ ఉండే ఇబ్రహీంపట్నం లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.బస్తీ దవఖానాల పేరుతో అనవసర ప్రచారం  చేస్తున్నారని..వెంటనే వాటిని ఆపి సివిల్ సర్జన్లను నియమించాలన్నారు. అందుబాటులో వైద్యులు ఉంటే ఇంత ఘోరం జరగకుండా ఉండేదన్నారు. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ను ప్రక్షాళన చేయాలని..ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.