
- నమ్మకం లేకనే రేవంత్ హై టెన్షన్ లైన్
- త్వరలో వికసిత తెలంగాణ సంకల్ప పత్రం
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ఓటర్లను కలవడంలో తమ పార్టీ ఈఅభ్యర్థులు ముందుండడంతో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు జీర్ణించుకోలేక.. పత్రికల్లో శీర్షికల కోసం అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఏకమై బీజేపీని ఓడించలేరన్నారు. వికసిత తెలంగాణ పేరుతో ఒక సంకల్ప పత్రం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 100 రోజుల పరిపాలనను రెఫరెండంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు.