ప్రముఖ అణు శాస్త్రవేత్త, కేరళకు చెందిన ప్రముఖ రచయిత, వామపక్ష సిద్ధాంతకర్త అయిన ఎంపీ పరమేశ్వరన్ (91) మంగళవారం తన నివాసంలో కన్నుమూశారు. వివాదాస్పద 'నాల్గవ ప్రపంచం' సిద్ధాంతం ద్వారా ఆయన ఎంతో పేరు సంపాదించారు. అయన మరణ వార్తతో ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆయన జీవిత విశేషాలు, చేసిన సేవలు:
బహుముఖ ప్రజ్ఞాశాలి: ఆయనో శాస్త్రవేత్తగా, రచయితగా, సిద్ధాంతకర్తగా ఇంకా అక్షరాస్యతా కార్యకర్తగా ఎంతో సేవ చేశారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన 'కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్' (KSSP) వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు.
విద్య, నేపథ్యం: పరమేశ్వరన్ 1935 జనవరి 18న త్రిస్సూర్ జిల్లాలోని కిరలూరులో జన్మించారు. తిరువనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత రష్యాలోని మాస్కో పవర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ (PhD) పట్టా పొందారు.
సైన్స్, సాహిత్యం, సమాజం, రాజకీయ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మృతితో ఆ రంగాలకు తీరని లోటు ఏర్పడింది.
