కేంద్రం సరిగా ఫండ్స్ ఇస్తలేదు : దిశ కమిటీ చైర్మన్, ఎంపీ రఘురామిరెడ్డి

కేంద్రం సరిగా ఫండ్స్ ఇస్తలేదు : దిశ కమిటీ చైర్మన్, ఎంపీ రఘురామిరెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సెంట్రల్​ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి నిధులను సక్కగా ఇస్తలేదని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామిరెడ్డి విమర్శించారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో రఘురామిరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో మార్పులతో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు స్టేట్ నుంచి ఇచ్చే డబ్బులు సకాలంలో వస్తున్నాయని, కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్లో మాత్రం తిరకాసులుంటున్నాయన్నారు.

ఇంజినీరింగ్, హెల్త్, రూరల్ వాటర్​ స్కీమ్స్​పై ప్రధానంగా ప్రజాప్రతినిధులు చర్చించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ ఆయా శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫారెస్ట్ పర్మిషన్స్ పేర అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. పనుల విషయంలో కలుగుతున్న ఇబ్బందులను కనీసం తమ దృష్టికి తీసుకురావడం లేదని అధికారులపై మండిపడ్డారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన దాదాపు రూ.40 కోట్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఏరియా హాస్పటల్స్​లలో అంబులెన్స్​లు లేక రోగులు ఇబ్బందులు పడ్తున్నారన్నారు. అశ్వారావుపేటకు అంబులెన్స్ సాంక్షన్ అయిందని చెప్పి ఏడాది తర్వాత నిధులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పీహెచ్​సీలలో డాక్టర్లు లేక స్టాఫ్​ నర్సులే వైద్యం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. మణుగూరు మున్సిపాలిటీ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న అమృత్​ స్కీం పనులు ముందుకు సాగడంతో లేదన్నారు. కొత్తగూడెం బైపాస్ రోడ్డు నిర్మాణంపై డీపీఆర్ రూపొందిస్తున్నట్టు నేషనల్ హైవే ఆఫీసర్లు పేర్కొన్నారు. ప్రోగ్రాంలో కలెక్టర్ అంకిత్, డీఎఫ్​వో కిష్టాగౌడ్, దిశ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.