
- వర్సిటీకి రావొద్దని టీఆర్ఎస్వీ
- అనుమతియ్యాలని ఎన్ఎస్యూఐ ఆందోళనలు
సికింద్రాబాద్, వెలుగు : కాంగ్రెస్అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 7న ఓయూ పర్యటనపై ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓయూలో అడుగుపెట్టనీయబోమంటూ.. టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ ఓయూ పర్యటనను అడ్డుకుంటే సహించబోమంటూ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఆందోళన చేస్తున్నాయి. రాహుల్పర్యటనకు అనుమతి ఇవ్వరాదంటూ టీఆర్ఎస్వీ నాయకులు, అనుమతి ఇచ్చి తీరాలని ఎన్ఎస్యూఐ లీడర్లు ఓయూ అధికారులకు పరస్పరం వినతి పత్రాలు ఇచ్చారు. దీంతో అసలు అనుమతి ఇవ్వాలా? వద్దా? అని ఓయూ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కోటూరి మానవతారాయ్ తదితరులు నెల 22న ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ కు అనుమతి కోసం వినతి పత్రం ఇచ్చారు. వారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు వీసీనీ కలిసి పర్మీషన్ఇవ్వాలని కోరారు. కాగా ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వరాదని, ఇస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్వీ నాయకులు కూడా వీసీకి వినతి పత్రాలు ఇచ్చారు.
కోర్టుకు వెళ్లిన నాయకులు
రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓయూ స్కాలర్లు కొందరు ఇటీవల లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 28న విచారణ చేపట్టిన కోర్టు మే 2న హౌజ్‌మోషన్ పిటీషన్ దాఖలు చేసుకోవాని, లేదంటే మే 5న రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కాగా కోర్టు తీర్పును బట్టి అనుమతి ఇవ్వాలా.. లేదా.. అన్నది నిర్ణయం తీసుకుంటామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు.