హైకమాండ్ వద్దంటే పోటీ చేయను: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైకమాండ్ వద్దంటే  పోటీ చేయను: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • మా ఇద్దరి సీట్లపై అధిష్టానానిదే తుది నిర్ణయం: ఉత్తమ్
  • రెండు సెగ్మెంట్లలో 50వేల మెజారిటీతో గెలుస్తం
  • కాంగ్రెస్ తుఫాన్​లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని కామెంట్

హైదరాబాద్, వెలుగు:  హుజూర్​నగర్, కోదాడ నియోజకవర్గాల్లో తమకు 50వేలకుపైగా మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను, తన భార్య పద్మావతి నియోజకవర్గాల్లోనే ఉంటున్నామని, హైదరాబాద్​లో ఉన్న ఇంటిని కేవలం క్యాంప్ ఆఫీస్​గా వాడుకుంటున్నామని చెప్పారు. తమ ఇద్దరి పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. హైకమాండ్ వద్దంటే పోటీ చేయనని స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో చిట్​చాట్ చేశారు. పార్టీలో అభ్యర్థుల లిస్ట్​ను త్వరగా ప్రకటించాలన్నారు. టికెట్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తుఫాన్​లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అహంకారం ఎక్కువైందని, అది ప్రజలకు నచ్చడం లేదని విమర్శించారు. 2018తో పోలిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసుల హరాస్​మెంట్ దారుణంగా ఉందని, తన ముప్పై ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వేధింపులు ఎప్పుడూ చూడలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ పుంజుకుందని, నాలుగు నుంచి ఐదు స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. నల్గొండతో పాటు ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 

కర్నాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినం

కర్నాటకలో ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ఉత్తమ్ తెలిపారు. కోటి మంది మహిళలకు.. నెలకు రెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి స్కీమ్ ప్రారంభించామన్నారు. 200లోపు యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్​లోనూ ఇచ్చిన హామీలో భాగంగా ఓపీఎస్​ను అమలు చేశామన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ 99 హామీలిస్తే అందులో 90 నెరవేర్చలేదన్నారు. దళిత సీఎం, దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువులు సహా ఎన్నో హామీలను కేసీఆర్​ గాలికొదిలేశారని ఆరోపించారు.