- లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
- పెద్దపల్లి జిల్లాలో 20 ఆయుష్ డిస్పెన్సరీలున్నయని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: కోల్ ఇండియా లిమిటెడ్ ఆస్పత్రుల్లో ఆయుష్ వైద్య నిపుణులు, వృత్తిపరమైన ఆరోగ్య నిపుణులకు మధ్య ప్రత్యేకంగా సమన్వయ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయలేదని కేంద్రం అంగీకరించింది. అలాగే వైద్య సంస్థల సహకారంతో బొగ్గు గని కార్మికుల న్యుమోకోనియోసిస్‌కు ఆయుష్ చికిత్సల సామర్థ్యం, ప్రభావిత గని కార్మికులకు చికిత్స చేయడంలో సాధించిన ఫలితాలపై ఎలాంటి పరిశోధనలు చేయలేదని వెల్లడించింది. ఈ మేరకు లోక్ సభలో శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి(ఇండిపెండెంట్ చార్జ్) ప్రతాప్ రావ్ యాదవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెద్దపల్లి కోల్ బెల్ట్ ఏరియాలో కేంద్ర ప్రాయోజిత జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం) స్కీం కింద ఆయుర్వేద/యునానీ డిస్పెన్సరీలకు ఏడాదికి రూ. 2 లక్షలు, హోమియోపతి డిస్పెన్సరీలకు రూ. లక్ష చొప్పున మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిత్యావసర మందులను ఈ-–టెండర్ల ద్వారా సేకరించి, ఈ–ఔషధి పోర్టల్ తో ఇండియన్ మెడిసిన్స్ ఫార్మసీల ద్వారా డిస్పెన్సరీలకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాతో సహా తెలంగాణలోని ఎంపిక చేసిన (100) ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు(ఆయుష్)లకు పంచకర్మ పరికరాలైన మసాజ్ టేబుల్, శిరోధార, స్టీమ్ బాత్ చాంబర్‌లు సరఫరా చేసినట్లు తెలిపారు.
ఇరవై ఆయుష్ డిస్పెన్సరీలున్నయ్..
గత ఐదేండ్లలో బొగ్గు, ధూళి ప్రభావం వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొంది, పెద్దపల్లిలో నియమితులైన ఆయుష్ వైద్యుల సంఖ్య ఎంత అని కూడా ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. అలాగే, పెద్దపల్లిలోని బొగ్గు గనుల కార్యకలాపాల సమీపంలో ప్రత్యేక ఆయుష్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు, న్యుమోకోనియోసిస్, ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి అభివృద్ధి చేసిన నిర్దిష్ట చికిత్సా విధానాల గురించి ఆరా తీశారు. ఈ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. పెద్దపల్లి జిల్లాలో 8 ఆయుర్వేద, 5 యునానీ, 6 హోమియోపతి, ఒక ప్రకృతి చికిత్స యూనిట్లతో సహా 20 ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రతి కేంద్రంలో ఆయా వైద్య విధానానికి చెందిన ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నట్లు చెప్పారు. ఈ వైద్యులు ప్రామాణిక చికిత్సా విధానంతో సహా వివిధ వ్యాధులకు చికిత్స అందించడంలో శిక్షణ పొందారన్నారు. వీరంతా గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో వివిధ విభాగాల్లో శిక్షణ పొందినట్లు తెలిపారు.
