- క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
- రాక్‌ఫిల్ డ్యాంపై ఆశలు వదులుకోని ఇంజనీర్లు
- ఈ వారంలోనే బ్యారేజీపై స్పష్టత
- రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీలో కోత
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్‌ను మట్టికట్టతోనే నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో మట్టి కొరత ఉండటంతో ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యాం తరహాలో రాక్‌ఫిల్ డ్యాం నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు తెహ్రీ డ్యాంను అధికారులు పరిశీలించారు. ఆ డ్యాం ఇంజనీర్ల సలహాలూ కోరారు. అయితే రాక్ ఫిల్ డ్యాంలు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేనందున మట్టికట్ట నిర్మాణానికే సీఎం మొగ్గుచూపారు. తాను ప్రాజెక్టు సైట్‌ను చూశాక నిర్ణయం తీసుకుంటానని అప్పుడే చెప్పారు. ఆగస్టు 29న సీఎం ప్రాజెక్టు పనులను సందర్శించారు. మట్టికట్ట నిర్మాణాన్నే దాదాపు ఫైనల్ చేశారు. ఇంజనీర్లు మాత్రం రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ కు వివరించి.. రాక్‌ఫిల్ డ్యాం కోసం ఒప్పించాలని భావిస్తున్నారు.
నిల్వ తగ్గిపోతోంది..
నార్లాపూర్ రిజర్వాయర్‌ను 8.61 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేశారు. 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మించాల్సి ఉంది. ఇందుకు 2 కోట్ల 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం. రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే ఉంది. దాంతో రాక్ ఫిల్ డ్యాం నిర్మిద్దామని భావించి.. రూ.1,182 కోట్ల వ్యయ అంచనా సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఆర్) సైతం రాక్ ఫిల్ డ్యాం వద్దని సూచించిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంజనీర్లు మాత్రం మట్టి కొరతను అధిగమించలేమని, రాక్‌ఫిల్ డ్యాం బెటరని అంటున్నారు. సీఎం కన్విన్స్ కాకపోతే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో మరింత లోతుకు వెళ్లి మట్టి తవ్వడంతో పాటు సమీపంలో అందుబాటులో ఉన్న గట్టి మట్టిని తరలించి కట్ట నిర్మిస్తామని చెప్తున్నారు. కట్ట ఎత్తు తగ్గించి, రెండో రీచ్‌లో వెడల్పు తగ్గించి నిర్మించాలని భావిస్తున్నారు. తద్వారా రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 2 టీఎంసీల మేర తగ్గిపోతుందని.. ఆ మేరకు వట్టెం, కర్వెన రిజర్వాయర్లలో ఒక్కో టీఎంసీ చొప్పున పెంచుకోవాలని సీఎం సూచించారు. 6.55 టీఎంసీల సామర్థ్యమున్న ఏదుల రిజర్వాయర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దానిని కల్వకుర్తి నీటితో నింపడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించగా.. అది కుదిరే పనికాదని ఇంజనీర్లు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.


