పంజాగుట్ట, వెలుగు: ఎంపీ రఘునందన్‌రావును వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ సంఘం నేత గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడుతూ.. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ముదిరాజ్‌లకు దక్కకుండా రఘునందన్‌రావు అడ్డుకున్నారని ఆరోపించారు.
సొంత పార్టీ అభ్యర్థులను కాదని, బీఆర్ఎస్ అభ్యర్థులకు వత్తాసు పలకడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని, పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి బహిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చెన్ని శ్రీనివాస్, జగన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
