ఎక్కడున్నారో తెలిసిపోయింది: అమెరికా యుద్ధనౌకలో వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్య.. న్యూయార్క్‎లో విచారణ

ఎక్కడున్నారో తెలిసిపోయింది: అమెరికా యుద్ధనౌకలో వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్య.. న్యూయార్క్‎లో విచారణ

వాషింగ్టన్: అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతడి భార్య సిలియా ఫ్లోర్స్ ఎక్కడ ఉన్నారనే ఉత్కంఠకు తెరపడింది. వెనిజులా అధ్యక్ష దంపతుల ఆచూకీని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెల్లడించారు. నికోలస్ మదురో, అతడి భార్య సిలియా ఫ్లోర్స్ అమెరికా యుద్ధ నౌకలో ఉన్నారని.. వీరు న్యూయార్క్‎లో న్యాయ విచారణను ఎదుర్కొంటారని ట్రంప్ తెలిపారు. దీంతో వెనిజులా అధ్యక్ష దంపతులు జాడపై నెలకొన్న సస్పెన్స్‎కు ఎండ్ కార్డ్ పడింది. 

అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే 2026, జనవరి 3వ తేదీన వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా వెనిజులా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెనిజులాపై దాడులను అఫిషియల్‎గా కన్ఫామ్ చేశారు. వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది తామేనని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా బలగాలు మదురో, అతడి భార్యను బంధించినట్లు తెలిపారు. మరోవైపు తమ దేశ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని వెనిజులా ప్రభుత్వం డిమాండ్ చేసింది. అధ్యక్షుడు మదురో బతికున్నాడో లేదో సాక్ష్యం చూపించాలని డిమాండ్ చేసింది.