వాషింగ్టన్: అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే 2026, జనవరి 3వ తేదీన వెనిజులాపై అమెరికా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా వెనిజులా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యూఎస్ తరలించాయి.
అమెరికా ట్రంప్ కూడా వెనిజులాపై దాడులను అఫిషియల్‌గా కన్ఫామ్ చేశారు. వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది తామేనని అధికారికంగా ధృవీకరించారు ట్రంప్. అమెరికా బలగాలు మదురో, అతడి భార్యను బంధించినట్లు తెలిపారు. అమెరికా ఒక దేశంపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వెనిజులాపై ట్రంప్ ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై చర్చలు మొదలయ్యాయి. అయితే.. వెనిజులాపై అమెరికా దాడులు చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు గ్లోబల్ పాలిటిక్స్‌ను నిశితంగా పరిశీలించే ఎక్స్పర్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆ మూడు కారణాలేంటో చూద్దాం..
ఈ 3 కారణాలతోనే వెనిజులాపై అమెరికా దాడి..!
వలస సంక్షోభం: మదురో విధానాల వల్ల లక్షలాది మంది వెనిజులాప్రజలు అమెరికాకు తరలివెళ్లాల్సి వచ్చిందని ట్రంప్ ఆరోపించారు. మదురో ఉద్దేశపూర్వకంగా నేరస్థులను, మానసిక రోగులను జైళ్లు, ఆసుపత్రుల నుండి విడుదల చేసి, వారిని అమెరికా వైపు నెట్టారని ఆయన ఆరోపించారు. గత పదేళ్లల్లో వెనిజులా నుంచి 70 శాతం మంది దేశం విడిచి వెళ్లారు. వీళ్లల్లో 80 శాతం మంది అమెరికా వైపు వెళుతున్నారు.
వెనిజులా చమురు వనరులు: వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఆ చమురుపైఎక్కువగా ఆధారపడి ఉండటంతో అమెరికా ఆ చమురుపై ఆసక్తి చూపుతోంది. వెనిజులా రోజుకు దాదాపు 900,000 బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తుంది. చైనా దాని అతి పెద్ద కొనుగోలుదారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉందని నమ్ముతారు. ఇటీవల, వెనిజులాతో అనుసంధానించబడిన చమురు ట్యాంకర్ను అమెరికా స్వాధీనం చేసుకుంది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా: కొకైన్ మరియు ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడానికి వెనిజులా ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ అన్నారు. ఈ కారణంగా, అతను రెండు వెనిజులా క్రిమినల్ ముఠాలు, ట్రెన్ డి అరగువా మరియు కార్టెల్ డి లాస్ సోలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా నియమించాడు.
