ఇరాన్ దేశాన్ని చుట్టుముట్టిన యుద్ధ విమానాలు : ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ఛాన్స్

ఇరాన్ దేశాన్ని చుట్టుముట్టిన యుద్ధ విమానాలు : ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే ఛాన్స్

అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ఒకేసారి రెండు భిన్నమైన మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే.. మరోవైపు అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని మధ్యప్రాచ్యంలో భారీగా మోహరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా చేపట్టిన ఈ అనూహ్య చర్యలు అటు శాంతి చర్చలకు ఇటు యుద్ధ సన్నద్ధతకు మధ్య ఉన్న సన్నని గీతను గుర్తుచేస్తున్నాయి. అమెరికా అనుసరిస్తున్న ఈ బల ప్రదర్శన - దౌత్య వ్యూహం ఇరాన్‌ను చర్చలకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. 

గడిచిన 24 గంటల్లో అమెరికా తన వైమానిక సామర్థ్యాన్ని మధ్యప్రాచ్యంలో అమాంతం పెంచేసింది. దాదాపు 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా ఈ ప్రాంతానికి తరలించింది. ఇందులో అత్యంత శక్తివంతమైన F-22, F-35, F-16 విమానాలు ఉన్నాయి. కేవలం యుద్ధ విమానాలే కాకుండా.. అవి గాలిలోనే ఇంధనాన్ని నింపుకోవడానికి అవసరమైన ఏరియల్ రిఫ్యూయలింగ్ ట్యాంకర్లను కూడా పెద్ద సంఖ్యలో తరలించింది అమెరికా. ఇది ఏదైనా దీర్ఘకాలిక ఆపరేషన్ లేదా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎయిర్ ఫోర్స్ తో పాటు నౌకాదళాన్ని కూడా అమెరికా బలోపేతం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన USS గెరాల్డ్ R. ఫోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ప్రస్తుతం అట్లాంటిక్ మీదుగా మధ్యప్రాచ్యం వైపు ప్రయాణిస్తోంది. దీనితో పాటు మూడు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న USS అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు తోడుగా ఈ కొత్త నౌకలు చేరనుండటంతో, ఇరాన్ పరిసర జలాల్లో అమెరికా పట్టు మరింత బిగుసుకోనుంది. ఈ భారీ సైనిక మోహరింపు ఇరాన్‌కు ఒక రకమైన హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు యుద్ధ మేఘాలు.. మరోవైపు శాంతి చర్చలు
విచిత్రమేమిటంటే.. ఈ సైనిక మోహరింపులు జరుగుతున్న సమయంలోనే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఒమన్ విదేశాంగ మంత్రి మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చల్లో ఇరు దేశాలు సానుకూల ధోరణిని ప్రదర్శించడం గమనార్హం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ చర్చలను నిర్మాణాత్మకమైనవిగా అభివర్ణించారు. వచ్చే రెండు వారాల్లో ఇరాన్ తన ప్రతిపాదనలతో మళ్లీ చర్చలకు రానుందని తెలుస్తోంది.