అమెరికాకు చెక్: హోర్ముజ్ జలసంధిలో ఒక్కటైన రష్యా, చైనా, ఇరాన్

అమెరికాకు చెక్: హోర్ముజ్ జలసంధిలో ఒక్కటైన రష్యా, చైనా, ఇరాన్

ప్రపంచ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. సముద్ర జలాల్లో అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతూ రష్యా, చైనాలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఇరాన్ గడ్డపై ఈ మూడు దేశాల కలయిక అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సైనిక నిఘా నీడలోనే చైనా, రష్యా యుద్ధనౌకలు ఇరాన్ నౌకాదళంతో చేతులు కలపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రష్యాకు చెందిన బాల్టిక్ ఫ్లీట్ 'స్టోయికీ' కార్వెట్ ఇప్పటికే ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి చేరుకుంది. దీనికి తోడుగా చైనా యుద్ధనౌకలు కూడా రావటంతో ఆ ప్రాంతంలో బల ప్రదర్శన పతాక స్థాయికి చేరింది. పాశ్చాత్య దేశాల పెత్తనాన్ని అడ్డుకుని.. సముద్రాలపై మల్టీపోలార్ ప్రపంచ క్రమాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు నికోలాయ్ పాత్రుషెవ్ స్పష్టం చేశారు. ఈ సంయుక్త విన్యాసాలు కేవలం సైనిక విన్యాసాలు మాత్రమే కాదని, అమెరికాకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న బలమైన కూటమికి ఇదొక సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా సైన్యం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రపంచ క్రూడ్ సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో రష్యా, చైనాల ఉనికి పెరగడం వాషింగ్టన్‌కు మింగుడుపడని విషయమే. ఇరాన్‌తో నెలకొన్న విభేదాల వేళ శత్రువుల శత్రువు మిత్రుడన్న చందంగా ఈ మూడు దేశాలు ఏకమవ్వడం భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఈ ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు సముద్ర భద్రత కోసమని చెబుతున్నప్పటికీ, లోతుగా చూస్తే ఇది పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఇస్తున్న గట్టి హెచ్చరికలా కనిపిస్తోంది.