ఆశయాన్ని బంధించలేరు: వేర్పాటువాదుల అరెస్టుపై ముఫ్తీ ఫైర్

ఆశయాన్ని బంధించలేరు: వేర్పాటువాదుల అరెస్టుపై ముఫ్తీ ఫైర్

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పీడీపీ, ఎన్సీ నిరసన
Mufti and NC leaders condemns kashmir separatist leaders arrestsశ్రీనగర్: కశ్మర్ వేర్పాటువాద నేతలను అరెస్టు చేయడంపై అక్కడి రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ.. కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి. కశ్మీరీలపై దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ నిరసన ర్యాలీ చేపట్టారు ఎన్సీ నేతలు. వేర్పాటువాదులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
ఇలా అయితే కశ్మీర్ సమస్య ఎప్పటికీ అంతే..
వేర్పాటు వాదుల అరెస్టుపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అన్నారు. గడిచిన 24 గంటల్లో హురియత్, జమాతే నాయకులను భారీ సంఖ్యలో అరెస్టు చేశారని ఆమె అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెయడం లేదన్నారు. వేర్పాటువాద నేతల్ని అరెస్టు వంటి నిర్ణయాలు కశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఉండిపోవడానికి కారణమవుతాయని చెప్పారు. ఏ నిబంధనల కింద ఈ అరెస్టులను సమర్థించుకుంటారో చెప్పాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారామె. ‘మీరు వ్యక్తులను బంధించగలరే కానీ, వారి ఆశయాలను అరెస్టు చేయలేరు’ అని ఆమె అన్నారు.
శుక్రవారం రాత్రి కశ్మీర్ వేర్పాటువాద నేత, జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు యాసిన్‌ మాలిక్‌ సహా హురియత్, జమాతే ఇస్లామీ నేతలను భారీ సంఖ్యలో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టికల్ 35(ఏ) రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
కశ్మీరీలకు ప్రత్యేక హక్కులను కట్టబెట్టే ఆర్టికల్ 35(ఏ)ని రద్దు చేయాలంటూ ఢిల్లీకి చెందిన ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టికల్ ప్రకారం కశ్మీర్ లో స్థానికులు మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకోవాలి. ఇతరులకు అవకాశం లేదు. అలాగే ఎటువంటి స్థిరాస్తులనూ కశ్మీరీలు తప్ప ఇతర భారతీయులెవరూ కొనుగోలు చేయకూడదు. ఈ నిబంధన వల్లే కశ్మీర్ వెనుకబడిందని, భారత్ నుంచి వేరుగా ఉందన్న భావన వస్తోందని, దీన్ని తొలగించాలని పిటిషనర్ కోరుతున్నారు.