అదానీని వెనక్కి నెట్టిన అంబానీ

అదానీని వెనక్కి నెట్టిన అంబానీ

రిచెస్ట్ ఇండియన్ లిస్టులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ 2023 లిస్టులో ముకేశ్ 9వ స్థానానికి చేరుకోగా గౌతమ్ అదానీ 10వ ప్లేస్ తో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానంలో నిలిచారు. అంబానీ సంపద 0.19 శాతం వృద్ధితో 164 మిలియన్‌ డాలర్‌లు పెరుగగా, అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్‌ డాలర్‌లు తగ్గిపోయిందని ఫోర్బ్స్‌ స్పష్టం చేసింది. ఇటీవల హిండెన్‌ బర్గ్‌ నివేదిక అదానీ గ్రూప్‌లో లొసుగులను బయటపెట్టడంతో అదానీ కంపెనీ షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.

ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ దిగ్గజం LVMH అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానంలో నిలిచారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ఒరాకిల్‌ ఛైర్మన్‌ లారీ ఎల్లిసన్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చీఫ్‌ వారెన్‌ బఫెట్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, టెలికాం దిగ్గజం కార్లోస్‌ స్లిమ్‌ హేలు అండ్‌ ఫ్యామిలీ, గూగుల్‌ అధినేత లారీ పేజ్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.