ములాయంసింగ్ యాదవ్ కన్నుమూత

ములాయంసింగ్ యాదవ్ కన్నుమూత

యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు 82ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హర్యానా గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్.. అప్పట్నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రాణాధార వ్యవస్థపై ఉన్న ఆయన.. సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కార్యాలయం తెలిపింది. 

 

క్రియాశీల రాజకీయాలకు దూరంగా..

గతంలో ములాయం సింగ్‌ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన్ను అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. దీనికి తోడు...రెండో భార్య మరణం కూడా ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. వీటి కారణంగానే  క్రియాశీల రాజకీయాలకు ములాయం దూరంగానే ఉన్నారు. దీంతో కుమారుడు అఖిలేష్ యాదవ్ అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్  మరోసారి ఎన్నికయ్యారు. 

యూపీ సీఎంగా మూడు సార్లు..
ములాయం సింగ్ యాదవ్ 1989, 1991,2003-07 మధ్య కాలంలో  మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996 నుంచి 98 మ‌ధ్యకాలంలో దేశ రక్షణ శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. 1974 నుంచి 2007 మ‌ధ్య కాలంలో యూపీ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప‌లు చిర‌స్మరణీయ విజ‌యాల‌తో సమాజ్ వాదీ పార్టీని ఉత్తరప్రదేశ్లో బ‌ల‌మైన ప‌క్షంగా నిలిపారు. ప్రస్తుతం ఆజ‌ంగఢ్ ఎంపీగా ఉన్న ములాయం సింగ్..ఆరోసారి లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.