ముంబైని ముంచెత్తిన ఆకాల వర్షాలు..నీటమునిగిన రోడ్లు, కాలనీలు, సబ్ వేలు క్లోజ్

ముంబైని ముంచెత్తిన ఆకాల వర్షాలు..నీటమునిగిన రోడ్లు, కాలనీలు, సబ్ వేలు క్లోజ్

ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలను బుధవారం(జూన్3) భారీ వర్షాలు ముంచెత్తాయి. అంధేరి, జోగేశ్వరి, మలాడ్, కాందివాలి, బోరివాలి ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షాలతో వెస్ట్ ముంబైలోని కీలక రవాణా మార్గమైన అంధేరి సబ్‌వేలో భారీగా నీరు చేరింది. నీటిమట్టం పెరగడంతో అధికారులు దాదాపు గంటపాటు ఈ సబ్ వేను మూసివేశారు. రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి నీటిని తొలగించడంతో తిరిగి వాహన రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వివరాల ప్రకారం..బుధవారం  ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పశ్చిమ శివారు ప్రాంతాల్లో సగటున 9.84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెర్సోవా పంపింగ్ స్టేషన్ దగ్గరఅత్యధికంగా 69 మిల్లీమీటర్ల వర్షం కురవగా, కూపర్ హాస్పిటల్‌లో 52 మిల్లీమీటర్లు, కె-ఈస్ట్ వార్డులో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.మరోవైపు నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వైపు దూసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.