ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వకుంటే యూనివర్సిటీపై బాంబులు వేస్తాం

ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వకుంటే యూనివర్సిటీపై బాంబులు వేస్తాం

ముంబై: యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడం ఆలస్యం చేస్తే త్వరగా ఇవ్వాలని ధర్నాలో, నిరసనలో తెలియజేస్తారు. త్వరగా ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ తమ పరీక్ష ఫలితాలను విడుదల చేయకుంటే యూనివర్సిటీ బిల్డింగ్‌పై బాంబులు వేసి పేల్చేస్తామని ఓ యూనివర్సిటీకి బెదిరింపులు వచ్చాయి. ఈ అనుభవం మహారాష్ట్రలోని ముంబై యూనివర్సిటీకి ఎదురైంది.

కరోనా నేపథ్యంలో యూనివర్సిటీ ఎగ్జామ్స్‌, వాటి ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కూడా ఆలస్యమైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ముంబై యూనివర్సిటీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారు. ‘‘బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షల రిజల్ట్ వెంటనే ప్రకటించాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే బాంబులు పెట్టి యూనివర్సిటీని పేల్చేస్తాం’’ అంటూ యూనివర్సిటీ ఎగ్జామ్స్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌‌కు భారీ సంఖ్యలో మెయిల్స్ వచ్చాయి. దీనిపై ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఐపీ అడ్రస్‌లు ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.