- మున్సిపాలిటీల్లో వరుసగా మంత్రుల పర్యటనలు
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో బిజీబిజీ
- ఎన్నికలపై దృష్టిపెట్టిన భట్టి, పొంగులేటి, తుమ్మల
- బీఆర్ఎస్ లోనూ ఎలక్షన్ల హడావుడి
- ఇవాళ కేటీఆర్ తో ముఖ్య నేతల మీటింగ్
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పుడే మున్సిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఒకవైపు ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఇవాళ విడుదల కానుంది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు మున్సిపాలిటీలను చుట్టేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. రూ.కోట్ల విలువైన డెవలప్ మెంట్ వర్క్స్ కు శంకుస్థాపనలు చేస్తున్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత శుక్రవారం మధిరలో పర్యటించారు. పూర్తిగా ఎలక్షన్లపైనే దృష్టిపెట్టిన ఆయన, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సమాయత్తం చేశారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. సంక్రాంతి పండుగలోగా మరోసారి ఆయా మున్సిపాలిటీల్లో పర్యటించి, అవకాశం ఉన్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వార్డుకు ఐదుగురితో కమిటీలు!
ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే ఉండగా, మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా, మెజార్టీలు తగ్గకుండా ఏకపక్షంగా మున్సిపాలిటీలను గెల్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వార్డుకు ఐదుగురు చొప్పున ముఖ్యకార్యకర్తలతో కమిటీ వేసి, ఎన్నికల ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఈ ఐదుగురు సభ్యుల కమిటీలు రెండేండ్లలో ప్రభుత్వం ద్వారా వివిధ స్కీమ్ల కింద లబ్ధిపొందిన వారిని కలవడం, ఇంకా అర్హులెవరైనా ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంపై దృష్టిపెట్టనున్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే ఆ టీమ్ లకు బాధ్యతలు అప్పగించారు. మధిరలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ కమిటీలపై చర్చ జరిగింది. ప్రతీ నాలుగు వార్డుల పర్యవేక్షణకు మరో సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ఈ మున్సిపాలిటీలతోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించేందుకు గాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు ఖమ్మం మేయర్, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కొంత వర్కవుట్ చేసినప్పటికీ ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. మూడ్రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి రూ.250 కోట్లు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు.
మున్సిపల్ ఎన్నికలు ఇక్కడే!
ఖమ్మం జిల్లాలో మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎలక్షన్లకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఈ మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు, మున్సిపల్ చైర్మన్లు కావాలని భావిస్తున్న వారు ఇప్పటికే ముఖ్య నేతలనుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్ల ప్రకియలో స్పీడ్ పెరగనుంది.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లెందు, వెలుగు : రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా గెలిచిన సర్పంచులు సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగాలని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలోని కొత్త సర్పంచులను, వార్డు మెంబర్లను ఆయన సన్మానించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన రెండేండ్లలో ప్రజలకు అందించిన సుపరిపాలన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 69శాతం గెలుపు అందించారని ఆయన గుర్తుచేశారు. అనంతరం ఇల్లెందు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో రూ.3.17 కోట్ల నగర అభివృద్ధి నిధుల ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇల్లెందు మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, మండల రాము, ఐదు మండలాల నాయకులు , కార్యకర్తలు, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐలు తాటిపాముల సురేశ్, బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లోనూ హడావుడి!
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనూ ఎన్నికల హడావుడి మొదలైంది. మూడ్రోజుల కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంలో పర్యటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్య నేతలతో మాట్లాడారు. శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో హైదరాబాద్ లో మరోసారి భేటీ కానున్నారు.
పూర్తిగా మున్సిపల్ ఎన్నికలకు కసరత్తులో భాగంగానే ఈ మీటింగ్ జరగనుంది. అదే సమయంలో ఇతర పార్టీలతో పొత్తులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆయా మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా కమ్యూనిస్టులు, టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య సర్దుబాట్లు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
