- ముగ్గురిని అరెస్ట్ చేసిన ఖమ్మం అర్బన్ పోలీసులు
- డబ్బులు తీసుకున్న వారితో గొడవకు దిగిన బాధితులు
- రూ.250 కోట్ల విలువైన భూమిని కాపాడాం : కలెక్టర్ అనుదీప్
- బాధితులకు ఇందిరమ్మ ఇల్లు : మంత్రి తుమ్మల
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో భారీ అక్రమ దందా వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు ఇంటి స్థలాల పేరుతో పేదల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరికి 100 గజాల స్థలం ఇప్పిస్తామంటూ రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. ఒకే స్థలాన్ని ముగ్గురు, నలుగురికి అమ్మిన ఘటనలు సైతం ఉన్నాయి.
సుమారు 15 మంది ఓ ముఠాగా ఏర్పడి గత పదేండ్లలో కొన్ని వందల మందిని మోసం చేసి కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు నిందితుల బ్యాంకు అకౌంట్లలో భారీ మొత్తంలో నగదు నిల్వ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వెలుగుమట్లలో మొత్తం 1,895 కుటుంబాలు ఉంటుండగా.. 600 మంది వరకు ఇండ్లు కట్టుకున్నారు. కొన్ని పక్కా ఇండ్లు కాగా.. ఎక్కువ మంది రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలోని వేర్వేరు మండలాలకు చెందిన వారే కాకుండా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, దమ్మపేట మండలాలకు చెందిన వారు ఉన్నారు.
మోసగాళ్లపై దాడికి బాధితుల యత్నం !
భూదాన్‌భూముల్లో కట్టుకున్న ఇండ్లను పోలీసులు, ఆఫీసర్లు ఖాళీ చేయిస్తుండడంతో ప్లాట్ల పేరుతో వసూళ్లకు పాల్పడిన వారు ముఖం చాటేశారు. నిందితుల్లో ఒకరైన అత్తారు అనే మహిళ గురువారం వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతల వద్దకు రావడంతో బాధితులంతా ఆమెను చుట్టుముట్టారు. ఓ దశలో తమ డబ్బులు తిరిగివ్వాలంటూ ఆమెపై దాడికి యత్నించడంతో ఆమె తప్పించుకొని పారిపోయారు.
అలాగే డబ్బులు వసూలు చేసిన ఎర్రబాబు అనే వ్యక్తిపై కూడా టీటీడీసీ దగ్గర బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. మరోవైపు భూదాన్ యజ్ఞ బోర్డ్, రెవెన్యూ శాఖ చేసిన విచారణలో.. నకిలీ పత్రాలతో అక్రమ కేటాయింపులు చేసి, పేదలను మోసగించారని తేలింది. మోసగాళ్లను నమ్మి నష్టపోయిన వారిలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు.
అక్రమ వసూళ్లు చేసిన ముగ్గురు అరెస్ట్
వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ముగ్గురిని ఖానాపురం హవేలీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వినోబా నవోదయ కాలనీకి చెందిన తల్లూరి కృష్ణ, మంకిడి లింగరాజు అలియాస్ లింగయ్య, ఖమ్మం అర్బన్ మండలం మూలగూడెంకు చెందిన ముడిగ రాములును అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు గ్యాంగ్‌గా ఏర్పడి.. తాము ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమంటూ ప్రచారం చేసుకున్నారు.
పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని నమ్మించి.. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. భూదాన్, ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములను ఆక్రమించి షెడ్లు నిర్మించారని, వాటిని పేదలకు మోసం చేశారని చెప్పారు. ఈ ముగ్గురితో పాటు మరికొందరు ఈ నెల 7న వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని అటవీ భూమిలోకి ప్రవేశించి, అక్కడ చైన్ లింక్ ఫెన్సింగ్ పనులు చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. ఇంకా ఎవరైనా వీరికి డబ్బులు ఇచ్చినట్లయితే ఫిర్యాదు చేయాలని సూచించారు.
రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాం : అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్
వెలుగుమట్ల గ్రామ సర్వే నంబర్ 147, 148, 149లోని భూదాన్ భూముల్లో కూల్చివేతలు, భూమి స్వాధీనం పూర్తిగా చట్టబద్ధంగానే చేశామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. రూ.250 కోట్లకుపైగా విలువైన 31.07 ఎకరాల భూదాన్ భూమి కొందరి ఆక్రమణలో ఉందన్నారు. సీసీఎల్ఏ, హైకోర్టు ఆదేశాల మేరకు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా భారీ స్థాయిలో ఆస్తిని రక్షించగలిగామన్నారు. ఫిబ్రవరి 24న నిర్వహించిన కూల్చివేతలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కాగా, కోర్టు కూడా దానిని తిరస్కరించిందన్నారు.
హైకోర్టు స్టే ఉన్న నిర్మాణాలను మినహాయించి, మిగిలిన భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకొచ్చామని చెప్పారు. భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ శాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు బయటపడ్డాయన్నారు. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూమిని భవిష్యత్ అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హులైన పైదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
