- వార్షికాదాయం 181.99 కోట్లుగా అంచనా
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్‌కు పాలక వర్గ సభ్యులు ఆమోద ముద్ర వేశారు. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ కడవెర్గు మంజుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి కలెక్టర్ కె. హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2026–-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.181.99 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, వివిధ అభివృద్ధి పనులకు 181.93 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.
దీంతో 6.10 లక్షల రూపాయల మిగులు ఉండనుంది. మొత్తం సాధారణ ఆదాయం 52.96 కోట్లలో మూడవ వంతు వెనుకబడిన మురికివాడలు, విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 10 శాతం, హరిత బడ్జెట్‌కు 5.29 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల మాట్లాడుతూ, అందరి కృషితో సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో గొప్ప కార్యక్రమాలను నిర్వహించి, సిద్దిపేట పేరును గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరవేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో బేస్‌మెంట్ లెవల్‌లో ప్రారంభమైన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులుగా గుర్తించాలని, పట్టణానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఎర్ర చెరువు కట్ట కింద చిన్న చిన్న కాలవలు, నాలాలను మట్టితో నింపేసినందున నీరు ప్రవహించడం ఇబ్బందిగా ఉందని చెప్పగా, రెవెన్యూ శాఖతో కలిసి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
