- ఇప్పటికే మాస్టర్ ప్లాన్ విడుదల
- ఎంపీ,ఎమ్మెల్యే, కలెక్టర్ వరుస రివ్యూలు
- మూడు నెలల్లో భూ సేకరణ పూర్తయ్యేలా ఏర్పాట్లు
- 2027 జూన్ నాటికి పనులు పూర్తిచేసేలా ప్లాన్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని సజావుగా సాగితే తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న భూమి పూజ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఆలోగా భూ సేకరణ, ప్రజల అభిప్రాయాలు, మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చిన అంశాలపై పకడ్బందీగా సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వరుస రివ్వ్యూలు నిర్వహిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తున్నారు. ఎయిర్పో ర్ట్మొత్తానికి ఎన్ని ఎకరాలు భూమి కావాలి, ఎక్కడి వరకు అవసరం, సరిహద్దులు తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. మూడు నెలల్లో భూ సేకరణ చేపట్టి, సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నారు. జూన్ 2న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. 2027 జూన్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
2.5 కిలోమీటర్ల రన్ వే..
ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులిస్తూ పనులు స్పీడప్ చేస్తున్నాయి. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారు. గతేడాది నవంబర్‌లో ఎయిర్ పోర్ట్కు సంబంధించి 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఏఐ అధికారులు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మైదానాన్ని పరిశీలించిన తర్వాత భూ సేకరణకు అనుమతులిచ్చింది. తాజాగా మూడు రోజుల క్రితం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌కు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. మూడు నెలల్లో భూ సేకరణ పూర్తిచేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే 379 ఎయిర్ ఫోర్స్ భూములు అందుబాటు ఉండగా మరో 700 ఎకరాలు సేకరించనున్నారు. పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా 2.5 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నారు. వ్యవసాయ భూముల భూ సేకరణ, పరిహారం అంచనాలతో నివేదిక రెడీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా భూ సర్వే చేపట్టేందుకు అవసరమైతే రిటైర్డ్ అధికారుల సాయం తీసుకోనున్నారు. పట్టణానికి ఆనుకొని ఉన్న అనుకుంట, కచ్ కంటి గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌పై అభిప్రాయాలు సేకరిస్తామని కలెక్టర్ చెబుతున్నారు.
అభివృద్ధి వైపు
ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. వ్యాపారాలు, రవాణా సదుపాయాలు మెరుగపడనున్నాయి. పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
ఎయిర్పోర్ట్ నిర్మాణ అనుమతులు వేగవంతం
ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు వేగంగా వస్తున్నాయి. ఇటీవల మాస్టర్ ప్లాన్ కు కూడా ఆమోదం లభించింది. భూ సేకరణ, టెక్నికల్ సమస్యలపై దృష్టి పెట్టాం. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలి. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తయితే జూన్ 2న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. - పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
